ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద గుణపాఠమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలమెంతో తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఫలితాలు తెలంగాణలో కూడా పునరావృతం అవుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని నమోదు చేస్తుందని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిద గుడ్డు వచ్చిందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏమాత్రం సంబంధం లేదని, కాంగ్రెస్‌పై అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని వ్యంగ్యంగా సూచించారు. కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడడం మోసపూరితంగా ఉందన్నారు.
తెలంగాణలో బీజేపీకి పోటీగా నిలబడే శక్తి ఉందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభావం మరింత పెరుగుతుందని రఘునందన్ రావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎదుగుదల చూసి ఇతర పార్టీల నేతలు భయపడుతున్నారని చెప్పారు.
కేటీఆర్‌కు నిజమైన ధైర్యం ఉంటే అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పోటీ చేసే ధైర్యం లేనివారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ గురించి తక్కువగా మాట్లాడితే మంచిదని సూచిస్తూ, తెలంగాణలో బీజేపీ హవా చూపేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.