వసంత పంచమి పర్వదినం సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా అమృతస్నానాలు చేస్తూ భక్తి సంద్రంగా మారింది. త్రివేణీసంగమంలో పవిత్ర స్నానం ఆచరించి పాప విమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఈ రోజు ఒక్కరోజే 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. కుంభమేళా ప్రధాన ఘట్టాల్లో వసంత పంచమి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. భక్తులతో పాటు సాధువులు, మునులు, అఖాడాల గురువులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాకుంభమేళాలో శివనామస్మరణతో గంగా తీరాలు మారుమోగుతున్నాయి.
మౌనీ అమావాస్య రోజు భారీగా భక్తులు హాజరవ్వడంతో తొక్కిసలాట ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ముందుగానే భారీ ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం పోలీసుల నియామకం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి భక్తులకు సమాచారాన్ని అందిస్తోంది.
గంగానది ఒడ్డున ఆలయాలు, పూజా మండపాలు భక్తి భావాన్ని పెంచుతున్నాయి. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానం చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సన్యాసుల దీక్షలు, భక్తుల హారతులతో మహాకుంభమేళా ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
