గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో డీసీపీ మాదాపూర్, డీసీపీ క్రైమ్స్, సీసీఎస్ మాదాపూర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ మోస్ట్ వాంటెడ్ భతుల ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో అతను పోలీసులపై కాల్పులు జరిపాడని, అయినప్పటికీ ధైర్యంగా వ్యవహరించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
అతడు నివసిస్తున్న అద్దె ఇంటిని సోదా చేయగా, రెండు పిస్టల్స్, బుల్లెట్లు, ఇతర ఆయుధాలు, దొంగతనానికి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అతను అత్యంత ప్రమాదకర నేరస్థుడిగా ఉన్నాడని, పలు దొంగతనాలు, ఆయుధాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు.
సీసీఎస్ మాదాపూర్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి క్రైమ్ స్టాప్ పోలీస్ టీమ్స్ సమర్థంగా సమన్వయం చేసుకుని, అనేక రోజుల పాటు నిఘా పెట్టి అతడిని పట్టుకున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న టీమ్ సభ్యులకు డీసీపీ అభినందనలు తెలిపారు.
సైబరాబాద్ పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్నారని, భవిష్యత్తులో కూడా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
