తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ తరహాలో పాలకమండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముసాయిదా నిబంధనల్లో మార్పులు సూచిస్తూ ఆలయ పరిపాలన మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
బుధవారం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పాలకమండలి నియామకంపై సమీక్ష నిర్వహించారు. రాజకీయ ప్రభావం లేకుండా ఆలయ పరిపాలన కొనసాగాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి, సేవా కార్యక్రమాల నిర్వహణపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పాలకమండలి నియామక నిబంధనలపై సీఎం పలు మార్పులను సూచించారు. ఆలయ నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచేలా పాలకమండలి విధులు నిర్వర్తించాలని ఆయన పేర్కొన్నారు. దేవదాయ శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల ఆలయాన్ని ఆదర్శంగా తీసుకుని పాలన వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. పాలకమండలి నియామకానికి సంబంధించి తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఆలయ పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం తెలిపారు.