చత్తీస్‌గఢ్‌లో భద్రతాదళాలు వరుస ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందడంతో మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఏపీకి తలదాచుకునేందుకు తరలుతున్నారని సమాచారం.
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ DGP ద్వారకా తిరుమలరావు ఈ విషయాన్ని వెల్లడించారు. గత మూడేళ్ల తర్వాత తొలిసారిగా 30 మంది మావోయిస్టులు ఏపీ వైపు ప్రవేశించినట్లు తెలిపారు. వీరిలో 13 మంది ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోయారని, మిగతా వారిపై గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
నల్లమల అటవీ ప్రాంతం, ఏఓబీ గతంలో మావోయిస్టుల ప్రధాన ఆశ్రయంగా ఉండేది. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లు పెరగడంతో మళ్లీ ఈ ప్రాంతాలను ఆశ్రయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏపీని షెల్టర్‌గా వాడుకునేంత అసమర్థత ఏపీ పోలీసులకు లేదని, ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DGP స్పష్టం చేశారు.
మావోయిస్టుల కదలికలపై ఏపీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మావోయిస్టుల తరలివస్తున్న అనుమానిత ప్రాంతాల్లో నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.