నెల్లూరు బాలాజినగర్ 15వ డివిజన్లో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ వైసీపీ నేత బాలకృష్ణ రెడ్డి ఇంటిని కూల్చివేశారు. ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులపై కావాలనే దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి బాలకృష్ణ రెడ్డిని పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల ఇళ్లను కూల్చివేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు. ముఖ్యంగా మంత్రి నారాయణ నేతృత్వంలో అక్రమంగా ప్రజల ఇళ్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.
వైద్యుల ఆసుపత్రులను కూడా టార్గెట్ చేస్తూ, కట్టడాలను కూల్చివేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను అక్రమంగా తొలగిస్తూ, మంచినీటి, కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తూ నారాయణ అన్యాయాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను దోచుకునే పాలన సాగిస్తే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరిపైనా దౌర్జన్య చర్యలు సహించదని, ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా నగరానికి విచ్చేసి, బాలకృష్ణ రెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
