పార్వతిపురం మన్యం జిల్లాలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఆర్.సి.ఎం కార్యాలయ సముదాయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైనదని, దాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు తీర్చిదిద్దటంలో ఓటు హక్కు కీలక భూమిక పోషిస్తుందని, ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్లు కట్టుబడి ఉండాలని తెలిపారు.
జిల్లాలో మొత్తం 7,81,898 మంది ఓటర్లు ఉన్నారని, గత సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 80 నుంచి 82 వరకు నమోదైందని పేర్కొన్నారు. అయితే ఓటింగ్ శాతం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ప్రతి అర్హులైన వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఓటు ద్వారా లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిరవహించాలని కలెక్టర్ అన్నారు.