తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కోల్డ్ అలర్ట్ జారీ చేసింది. జనవరి 21, 22 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శ్రీలంకకు దిగువన అల్పపీడనం ఏర్పడటంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో వర్షంగా కాకుండా చలి తీవ్రతగా కనిపించనుంది. మేఘాలు తగ్గిపోవడంతో రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం తెలంగాణలో మరింత ఎక్కువగా ఉండనుంది. ప్రజలు రాత్రిళ్లు అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు.
తీవ్ర చలి కారణంగా తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ, అడవి ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గాలుల ప్రభావం బంగాళాఖాతంలో అధికంగా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కొంత మేర తగ్గినప్పటికీ చలి తీవ్రత కొనసాగనుంది. హైదరాబాద్ వాసులు చలి ప్రభావంతో ఇబ్బంది పడుతున్నందున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
