టాలీవుడ్‌లో సంథ్య థియేటర్ తొక్కిసలాట, మోహన్ బాబు ఫ్యామిలీ పరిణామాల తర్వాత మంగళవారం ఉదయం జరిగిన ఐటీ దాడులు చిత్రపరిశ్రమలో కలకలం రేపాయి. మొదట ఈ దాడులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పైనే జరిగాయని భావించారు. కానీ పరిస్థితులు మారిపోయాయి.
ఐటీ శాఖ దాదాపు 55కి పైగా బృందాలతో టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాతలు, పంపిణీదారులు, స్టూడియోలపై దాడులు జరిపింది. ఈ దాడులు అకస్మాత్తుగా జరగడం తెలుగు చిత్రపరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పరిశ్రమలోని పెద్దలంతా ఈ దాడుల వెనుక అసలు కారణం ఏమిటనే అనుమానాల్లో ఉన్నారు.
ఈ దాడుల వల్ల తెలుగు చిత్రపరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందా? టాలీవుడ్ ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇటీవల టాలీవుడ్‌లో జరుగుతున్న వివాదాలు, ఫైనాన్స్ లావాదేవీలు, సినిమాలకు సంబంధించిన ఖర్చులు పరిశీలించేందుకు ఐటీ శాఖ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల ప్రభావం పరిశ్రమపై ఎంతటి స్థాయిలో ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

 
				 
				
			 
				 
				