తైవాన్లో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. యుజింగ్ జిల్లాలో రాత్రి పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. కొన్ని భవనాలు కూలిపోయాయి, వంతెనలు దెబ్బతిన్నాయి. భూకంపం ధాటికి 27 మంది వరకు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
మొదట 5.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆపై 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. అర్ధరాత్రి దాటాక 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. చియాయి కౌంటీలోని దాపు టౌన్షిప్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇది 9.4 కి.మీ లోతులో ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప తీవ్రత 6.0 గా నమోదైంది. భూకంప ప్రభావం నాన్క్సీ జిల్లాలో అధికంగా కనిపించింది. అక్కడ ఓ ఇల్లు కూలిపోవడంతో ఓ చిన్నారి సహా ముగ్గురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. తైవాన్లో గతంలో అనేక భూకంపాలు సంభవించినప్పటికీ, ఈసారి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దక్షిణ తైవాన్లో భూకంప ప్రభావంతో రహదారులు దెబ్బతిన్నాయి. అధికారులు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. సహాయక చర్యల్లో రెస్క్యూ టీమ్స్, వైద్య సిబ్బంది, అగ్నిమాపక దళాలు సత్వర చర్యలు చేపట్టాయి.
