నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క అధ్యక్షతన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందేలా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ జరగాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఆధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించి, పేదరికంలో ఉన్న వారిని గుర్తించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో సర్వే చేయించి, ఈ నెల 24లోగా పూర్తి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా తదితర పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని సూచించారు.
జిల్లాలో 509 రెవిన్యూ గ్రామాల్లో డేటా సేకరించి, అధికారులకు అందుబాటులో ఉంచారని అధికారులు తెలిపారు. 18 మండలాల్లో 102 విస్తరణ అధికారులు సర్వే ప్రారంభించారని, లబ్దిదారుల ఇంటి స్థితిగతులను పరిశీలించి సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి, ముసాయిదా జాబితాను ప్రదర్శించి తుది జాబితా ఆమోదించాలని నిర్ణయించారు. ఎంపీడీవోలు అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమీక్షలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
