చైనాలో హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటాప్నూమో వైరస్) వైరస్ విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశం స్పందించింది. ఆస్పత్రుల్లో రద్దీ పెరుగుతోందన్న నివేదికలను చైనా అధికారికంగా ఖండించింది. ఈ వైరస్ కారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని స్పష్టం చేసింది.
చలికాలంలో సాధారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధుల తీవ్రతను నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చైనా ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య విదేశీయులు చైనాలో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ భరోసా ఇచ్చింది.
చైనా ప్రభుత్వం తమ పౌరులతో పాటు చైనాలో నివసిస్తున్న విదేశీయుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొంది. వైద్యసౌకర్యాలు బలోపేతం చేసి, ఏవైనా వ్యాధులు విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం చైనాలోని పరిస్థితులు నిశ్చింతకరంగా ఉన్నాయని, హెచ్‌ఎంపీవీ వైరస్ కారణంగా పెద్దగా ప్రమాదం లేదని చైనా అధికారిక ప్రకటనలో పేర్కొంది. దేశం లోపల ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, విదేశీయులకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని తెలిపింది.