గత రెండు రోజులుగా ఉత్తర భారతదేశాన్ని పొగమంచు చుట్టుముట్టి తీవ్ర ప్రభావం చూపుతోంది. శనివారం ఉదయానికి కూడా పొగమంచు తీవ్రత తగ్గకపోవడంతో పరిస్థితులు మార్పు లేకుండా ఉన్నాయి. దట్టమైన మంచు కారణంగా విజిబిలిటీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రహదారులపై కొన్ని మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
విజిబిలిటీ మూడు మీటర్లకు పడిపోవడంతో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వందలాది ఫ్లైట్స్ రద్దవ్వగా, కొన్ని ఇతర ప్రాంతాలకు మళ్లించబడ్డాయి. రాత్రి 12.15 గంటల నుంచి ఉదయం వరకు 15 విమానాలు దారి మళ్లించగా, 43 సర్వీసులు రద్దయ్యాయి. 255 ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచాయి. ఈ పరిణామాలు ఆ ప్రాంతంలోని ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.
రైలు సర్వీసులు కూడా పొగమంచు ప్రభావానికి లోనయ్యాయి. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రవాణా వ్యవస్థలో చోటుచేసుకున్న ఈ ఆలస్యాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా 400కు పైగా రైలు మరియు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
ఇక రహదారులపై కూడా పరిస్థితి అదుపు తప్పింది. పొగమంచు తీవ్రతతో రోడ్లపై ప్రయాణాలు సురక్షితం కాని స్థితికి చేరుకున్నాయి. ఇదే పరిస్థితులు కొనసాగితే ప్రజల దైనందిన జీవితాలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.