దక్షిణాది డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. రామ్ చరణ్ నటనతో మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేయడం ఖాయమని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.
అయితే, ఈ సినిమా కర్ణాటకలో నిరసనలతో వివాదానికి దారి తీసింది. సినిమాలో టైటిల్ ఆంగ్లంలో ఉండటం కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ‘గేమ్ ఛేంజర్’ పోస్టర్లపై స్ప్రే చేసి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ‘బ్యాన్ గేమ్ ఛేంజర్ ఇన్ కర్ణాటక’ అనే హ్యాష్‌ట్యాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
కన్నడ భాషకు విశేషమైన ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. టైటిల్‌ను కన్నడ భాషలోకి మార్చాలని వారు కోరుతున్నారు. గతంలో కూడా షాపింగ్ మాల్స్, హోటల్స్ పేర్లు ఇంగ్లిష్‌లో ఉండటంపై కన్నడిగులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఈ వివాదం నేపథ్యంలో, ‘గేమ్ ఛేంజర్’ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ఆగ్రహించిన కొంతమంది అభిమానులు, ఆంగ్లంలో ఉన్న టైటిల్‌పై స్ప్రే వేసి తమ నిరసన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.