సిద్దిపేట పట్టణంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్. ఈ సందర్భంగా ప్రయాణికులతో, వ్యాపారస్తులతో, షాపు యజమానులతో సత్ప్రవర్తనతో వ్యవహరించాలని డ్రైవర్లను కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆటోలు ఇక్కడ పడితే అక్కడ పార్క్ చేయవద్దని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్లను సరైనవిగా కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సౌండ్ బాక్సులు వాడవద్దని, ప్యాసింజర్ల పరిమితిని దాటకుండా ప్రయాణాలు జరుపుకోవాలని తెలిపారు. విధిగా యూనిఫార్మ్ ధరించి, రోడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
షాపుల ముందు ఆటోలు పార్క్ చేయడం వల్ల షాపు యజమానులతో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. సుమన్ కుమార్ గారి సూచనలను డ్రైవర్లు పాటించి పట్టణ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని అన్నారు.