ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏ.డీ సినిమా ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్ పాప్యులర్ సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రతి ఏటా ఐఎండీబీ నిర్వహించే సర్వేలో ఈ ఏడాది అత్యధిక క్రేజ్ ఉన్న సినిమాల జాబితాను విడుదల చేయగా, ఈ జాబితాలో కల్కి 2898 ఏ.డీ అగ్రస్థానంలో నిలిచింది.
ఇక రెండో స్థానంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘స్త్రీ’ సినిమా నిలిచింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. మూడో స్థానంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ నిలవగా, నాలుగో స్థానంలో అజయ్ దేవగణ్, ఆర్. మాధవన్, జ్యోతిక నటించిన ‘షైతాన్’ నిలిచింది.
అదే విధంగా హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’, మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మెల్ బాయ్స్’, కార్తీక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భూలయ్య 3’ వంటి చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బాలీవుడ్ చిన్న సినిమా ‘కిల్’ కూడా టాప్ 10లో నిలవడం విశేషం.
అజయ్ దేవగణ్, కరీనా కపూర్ నటించిన ‘సింగం ఎగైన్’, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్లో రూపొందిన ‘లాపతా లేడీస్’ ఈ జాబితాలో నిలిచాయి. ప్రస్తుత ట్రెండింగ్ సినిమాలను ప్రతిబింబించే ఈ జాబితాలో తెలుగుసినిమా కల్కి 2898 ఏ.డీ అగ్రస్థానంలో నిలిచినందుకు ప్రేక్షకులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.