బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు గౌరవం తీసుకొచ్చాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో నితీశ్ తన తొలి సెంచరీని సాధించి, భారత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇది తెలుగు ప్రజలకు గర్వకారణంగా మారింది.
నితీశ్ ప్రదర్శనను గుర్తించి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రూ. 25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఈ వివరాలను వెల్లడించారు. బహుమతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. నితీశ్ వంటి యువ క్రికెటర్లను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
నితీశ్ ఆల్‌రౌండర్ షో గురించి మాట్లాడుతూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని కేశినేని అన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడే అవకాశాలు కల్పించేందుకు విశాఖ స్టేడియంను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ అభిమానులకు ఉత్తమమైన వసతులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఐపీఎల్ జట్టును తయారు చేయడం కోసం ఏసీఏ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు కేశినేని తెలిపారు. రాజధాని అమరావతిలో అత్యాధునిక స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. నితీశ్ రాణింపు రాష్ట్రానికి క్రికెట్ లో కొత్త శకం తెస్తుందన్నారు.