పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం ప్రపంచానికి శాంతి, ప్రేమ సందేశాన్ని అందించిన పండుగగా అభివర్ణించారు. క్రీస్తు ప్రేమ మార్గంలో మనసులు జయించి, సాటి మనిషికి మేలు చేయడమే మన కర్తవ్యమని సూచించారు.
ప్రభువు ఆశీస్సులతో ప్రేమ, సహనం, సేవ గుణాలతో జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలని ఆకాంక్షించారు. పశువుల పాకలో జన్మించిన ప్రభువు గొర్రెల కాపరిగా నిరాడంబరంగా జీవించి, నమ్మినవారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఘనతను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు.
ప్రభువు త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని, శాంతి మార్గాన్ని అనుసరించి ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా లోక రక్షకుడైన క్రీస్తు ఉపదేశాలను మనం దైనందిన జీవితంలో పాటించాలని ఆహ్వానించారు.
మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రన్న ప్రభుత్వం అందరికీ సమాన హక్కులు, అవకాశాలు, సౌకర్యాలు కల్పించే దిశగా నిరంతరం అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ మనందరికి ఆనందం, శాంతి, ప్రేమను తీసుకురావాలని ఆకాంక్షించారు.