సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతిలో మార్పు రావాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను నేడు పరామర్శించిన ఆయన, బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ ఆరోగ్యం విషమంగానే ఉన్నప్పటికీ క్రమంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. పోలీసులు సీపీఆర్ చేయడంతో బాలుడి ప్రాణాలు దక్కాయని వైద్యులు చెప్పారు. ఈ ఘటన సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారినట్టు తెలిపారు. ఆయన రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
కూనంనేని సాంబశివరావు ఈ సందర్భంగా బౌన్సర్లు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరిగే కారణం ఇదే అని చెప్పి, ఈ వ్యవస్థను రద్దు చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరపున డిమాండ్ చేసినట్టు తెలిపారు.
అంతేకాకుండా, సామాజిక సందేశాలు ఇచ్చే సినిమాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వకుండా రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
