ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు యువకులు ప్రాణాల మీదికి వెళ్లొచ్చారు. వేగంగా వెళ్తున్న ట్రక్ వారిని 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ట్రక్ ముందు టైర్ వద్ద యువకుడి తల కేవలం అడుగు దూరంలో ఉండడంతో భయానక వాతావరణం నెలకొంది. ట్రక్ ఆపలేదని గుర్తించిన ఓ బైకర్ వెంటనే స్పందించి ట్రక్‌ను నిలిపి యువకుల ప్రాణాలు కాపాడాడు.
ఆదివారం రాత్రి ఆగ్రా హైవేపై జరిగిన ఈ ఘటనలో, జకీర్ అనే యువకుడు తన స్నేహితుడితో డిన్నర్ చేసి ఇంటికి వెళ్తుండగా, ఓ ట్రక్ ఢీకొట్టింది. జకీర్, అతని స్నేహితుడు ట్రక్ కింద ఇరుక్కుపోయారు. డ్రైవర్ బండిని ఆపకపోవడంతో వారిని ట్రక్‌తో పాటు లాక్కెళ్లాడు.
ప్రాణభయంతో యువకులు కేకలు వేస్తుండగా, ఇతర వాహనదారులు ట్రక్‌ను ఆపడానికి ప్రయత్నించారు. కానీ డ్రైవర్ స్పీడ్ పెంచాడు. చివరకు ఓ బైకర్ ట్రక్‌ను ఓవర్‌టేక్ చేసి అడ్డుకోవడంతో ట్రక్ ఆగిపోయింది. వెంటనే యువకులను రక్షించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చేలోగా స్థానికులు ట్రక్ డ్రైవర్‌ను కొట్టారు. ప్రస్తుతం జకీర్, అతని స్నేహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ట్రాఫిక్ భద్రత ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది.