స్కూటర్ బాంబు పేలుడులో రష్యా న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన తన నివాసం నుంచి బయటకు అడుగుపెడుతుండగా బాంబు పేలడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ పేలుడులో కిరిల్లోవ్ తో పాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కిరిల్లోవ్ తన ఇంటి నుంచి బయటకు రావడం, బాంబు పేలుడుకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటన మాస్కోలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ఉక్రెయిన్ సైనిక వర్గాలు ఈ ఘటనకు తమ బాధ్యతగా పేర్కొన్నాయి. రసాయనిక ఆయుధాల ప్రయోగానికి అనుమతిచ్చినందుకు కిరిల్లోవ్ పై ప్రతీకార చర్య చేపట్టామని ఉక్రెయిన్ వెల్లడించింది. మాస్కోలోని కిరిల్లోవ్ నివాసం ముందు స్కూటర్ బాంబును ఉంచినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎస్ బీయూ) తెలిపాయి.
ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం స్పందిస్తూ ఉక్రెయిన్ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ ఘటనతో రష్యా-ఉక్రెయిన్ మధ్య మరింత ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
