నిర్మల్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు రాత్రి భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 35 మంది విద్యార్థులను పాఠశాల సిబ్బంది వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందించి, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హాస్టల్ ప్రాంగణంలోనే మెడికల్ క్యాంపు నిర్వహించి, మరికొందరు విద్యార్థులకు అక్కడే వైద్యం అందజేశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా వైద్యాధికారి రాజేందర్ ఆసుపత్రికి వెళ్లి అస్వస్థతకు గల కారణాలను సమీక్షించారు. రాత్రి భోజనం చేసిన తర్వాతే సమస్యలు ప్రారంభమయ్యాయని, తిన్న ఆహారం వికటించడం లేదా త్రాగునీరు కలుషితం అవ్వడం కారణంగా సమస్య ఏర్పడినట్టు విద్యార్థులు తెలిపారు.
ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం మరియు వైద్య శాఖ దర్యాప్తు ప్రారంభించాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెరుగైన జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.