గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. శనివారం నాడు అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని చరణ్ అభిమానాన్ని తెలియజేసేందుకు స్కై డైవ్ చేసి ప్రత్యేక పోస్టర్‌ను ప్రదర్శించాడు.
‘అమెరికాలో టికెట్ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం’ అని రాసిన పోస్టర్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి జంప్ చేస్తూ ప్రదర్శించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ‘గేమ్ ఛేంజర్’ టీమ్ షేర్ చేయడంతో సినిమా పై ఉన్న హైప్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో డల్లాస్ నగరంలో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ నెల 21న డల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ వేదికగా ఈ గ్రాండ్ ఈవెంట్ జరుగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుకుమార్ హాజరవుతారు. సినిమా టీజర్, పాటలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను కలిగించాయి.
రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.