శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకాము గ్రామ పరిధిలో రెయిన్బో ఇండస్ట్రీ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గంజాయిని నిర్వీర్యం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాధ్ జట్టీ, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం మన్యం ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు.
గత 8 నెలల వ్యవధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నమోదైన 226 కేసులలో 7,378 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, మూడవ దశలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ గంజాయిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేశారు.
ముందుగా అనకాపల్లి జిల్లాలో మొదటి దశలో, అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండవ దశలో గంజాయి నాశనం చేసినట్లు డీఐజీ గోపినాధ్ జట్టీ వెల్లడించారు. ఇప్పుడు మూడవ దశలో శ్రీకాకుళం జిల్లాలో కూడా గంజాయిని పూర్తిగా నాశనం చేస్తున్నామని తెలిపారు.
నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారని, డ్రగ్ మాఫియాను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామని అధికారులుఅన్నారు. మాదకద్రవ్య వ్యసనానికి గురికావద్దని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.