తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా ఆసుపత్రికి రూ. 5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక వ్యయంతో చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ ఆసుపత్రులను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, పేదలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో ఎక్సరే ప్లాంట్‌కు ఇన్వర్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే కొన్ని విభాగాల్లో సిబ్బంది కొరత ఉందని, త్వరలో భర్తీ ప్రక్రియ చేపడతామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆసుపత్రి వసతులను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
ప్రభుత్వ ఆసుపత్రి సేవలను మరింత ప్రజలకు చేరువ చేయాలని, ఇక్కడ అందించబడుతున్న వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రిలో ఉన్న వైద్యం, సదుపాయాలను మరింత మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
