అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, అంబేద్కర్ చూపిన మార్గాన్ని ఆర్టీసీ కూడా అనుసరిస్తోందన్నారు.
ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. టీఎస్ ఆర్టీసీలో త్వరలోనే 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు. ఈ నియామకాల వల్ల ప్రస్తుత సిబ్బందిపై ఉన్న పనిభారం తగ్గుతుందని చెప్పారు.
కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులపై ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. సంస్థ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, వారి అవసరాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇది కార్మికులకు ఒక ఊరటగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఖుష్రోషా ఖాన్, వెంకన్న, మునిశేఖర్, రాజ్శేఖర్, జాయింట్ డైరెక్టర్లు ఉషాదేవి, నర్మద, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ-ఎస్టీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అంబేద్కర్ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ సాగింది.