విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో రూ.20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టిడిపి నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. లే అవుట్‌లో కామన్ స్థలంగా వదిలిన 2,226 గజాల స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి. జకరయ్య అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం అన్యాయమని, ఇది పంచాయతీ స్థలమని స్పష్టం చేశారు. దీనిపై ప్రశ్నించగా తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని తెలిపారు.
ఈ స్థలాన్ని పంచాయతీ తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి కేటాయించిందని, దీనిపై తీర్మానం కూడా తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. కానీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న జకరయ్య పంచాయతీ ప్రణాళికలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు జకరయ్యకు మద్దతు అందిస్తున్నారని విమర్శించారు. గ్రామ ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేయాల్సిన అధికారులు, రాజకీయ పలుకుబడి వున్నవారి కోసం పనిచేయడం దారుణమన్నారు. ఈ కాలనీలో 3,500 కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా దీనికి ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం ఎఫ్‌సీఐ ఉద్యోగులు స్థలం కొనుగోలు చేసి, అప్పటి ఉడా అనుమతితో లే అవుట్ ఏర్పాటు చేశారని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉడా నిబంధనల ప్రకారం 5,000 గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో కొందరు ఆక్రమించిన స్థలాలను ఖాళీ చేయించామని, ఇప్పుడు మళ్లీ జకరయ్య అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అన్యాయమని అన్నారు. పంచాయతీ పరిధిలోని స్థలాన్ని కాపాడేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని, దీనిపై అధికారుల తక్షణ జోక్యం అవసరమని తెలిపారు.
విలేకరుల సమావేశం అనంతరం గ్రామస్తులు నగర పోలీస్ కమిషనర్, విజయవాడ రూరల్ మండలం తహసిల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని, పంచాయతీ హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ నాయక్, కమిటీ సభ్యులు వసంత్, చల్లగాని సునీల్, భాస్కరరావు, మోహన్ రావు, టిడిపి జిల్లా నాయకులు గుజ్జర్లపల్లి బాబురావు, జి. నరసయ్య, కోనేరు సందీప్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీ ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
