హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో వీల్‌చైర్ సేవల కోసం ఎన్నారై ప్రయాణికుడి నుంచి రూ. 10 వేలు వసూలు చేసిన ఘటన రైల్వే అధికారులను ఆగ్రహానికి గురిచేసింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు, బాధ్యుడి లైసెన్స్‌ను రద్దు చేసి అతడి నుంచి రూ. 9 వేలు వెనక్కి తీసుకున్నారు. బాధ్యుడిని సీసీటీవీ ఆధారంగా గుర్తించారు.
రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. కానీ, ఎన్నారై ప్రయాణికుడి కుమార్తె పాయల్ ఫిర్యాదు చేస్తూ తన తండ్రి నుంచి భారీ మొత్తం వసూలు చేశారని వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన నార్తరన్ రైల్వేస్ అధికారుల చర్యలు తీసుకున్నారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డివిజనల్ రైల్వే మేనేజర్ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు రైల్వే కట్టుబడి ఉందని తెలిపారు. ఇలాంటి ఘటనలు రైల్వే ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, నమ్మకాన్ని తగ్గిస్తాయని చెప్పారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు రైల్వే మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రయాణికులు తమ సమస్యలపై 139 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. రైల్వే సేవల పారదర్శకత, నాణ్యతను మెరుగుపరచడంపై కృషి చేస్తామని అధికారులు తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			