హృతిక్ రోషన్ న్యాయపోరాటం — తన పేరు, గొంతు, ఫొటో దుర్వినియోగంపై హైకోర్టులో పిటిషన్


బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన వ్యక్తిగత హక్కులను రక్షించుకునేందుకు న్యాయపోరాటానికి దిగారు. తన పేరు, ఫొటో, వాయిస్‌ను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను అనుమతి ఇవ్వకుండానే తన ఇమేజ్, గొంతును వినియోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు.

జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. తన ఇమేజ్ దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హృతిక్ విజ్ఞప్తి చేశారు. సమాచారం ప్రకారం, ఆయన పిటిషన్‌లో పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లు కూడా చేర్చినట్లు తెలిసింది.

హృతిక్ రోషన్ పిటిషన్ సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులపై మరోసారి చర్చ రేకెత్తించింది. గతంలో నటులు అక్కినేని నాగార్జున, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూడా తమ పేరు, ఫొటో, వాయిస్ దుర్వినియోగంపై కోర్టులను ఆశ్రయించారు. అలాగే ప్రముఖ గాయకుడు కుమార్ సాను తన గొంతును ఏఐ టెక్నాలజీతో అనుకరించడంపై, నటుడు సునీల్ శెట్టి తన హక్కులకు భంగం కలుగుతోందని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు హృతిక్ కూడా వీరి బాటలో చేరడంతో, డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ఇమేజ్ రక్షణ ప్రాధాన్యత మరింతగా పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *