టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నివాసంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించి రెండు డైమండ్ రింగ్‌లు సహా రూ.2.20 లక్షల విలువైన ఆభరణాలను అపహరించాడు. ఈ సంఘటన విశ్వక్ తండ్రి కరాటే రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 8లోని విశ్వక్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు అందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, అతని సోదరి వన్మయ బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంది. ఆదివారం తెల్లవారుజామున గదిలో వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గమనించిన ఆమె, బీరువా తనిఖీ చేయగా నగలు మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించి, సమీప సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో వేకువజామున ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయి. అతను కేవలం 20 నిమిషాల్లోనే చోరీ చేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుత దర్యాప్తులో ఈ దొంగ బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో సినీ పరిశ్రమలోనూ సంచలనం రేగింది. పోలీసులు త్వరలోనే దొంగను పట్టుకుంటామని విశ్వసిస్తున్నారు.