హర్యానాలో ఇటీవల చోటుచేసుకున్న రెండు వరుస ఆత్మహత్యలు రాష్ట్రవ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మొదట హర్యానా జైళ్ల శాఖ ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ తన నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ లేఖలో తనపై ఉన్నతాధికారులు కుల వివక్షతో వేధింపులకు పాల్పడుతున్నారని, తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అయిన అమ్నీత్ కుమార్ దీనిపై తీవ్రంగా స్పందించి, హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ బిజార్నియా పేర్లను బయటపెట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి డీజీపీని సెలవుపై పంపి, ఎస్పీని సస్పెండ్ చేసింది.
అయితే, ఇది జరిగిన కేవలం రెండు రోజులకు మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రోహ్‌తక్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సూసైడ్ నోట్‌లో పూరన్ కుమార్ అవినీతిపై విచారణ జరుపుతున్నానని, ఆ విచారణలో నిజాలు బయటపడతాయనే భయంతోనే పూరన్ తనువు చాలించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, పూరన్ అవినీతిపరుడని, ఆయన చేసిన ఆరోపణలు అసత్యమని తెలిపారు. తన నివేదిక వల్ల వచ్చిన ఒత్తిడితోనే పూరన్ ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు.
ఇక్కడి నుంచే కథలో మలుపు మొదలైంది. సందీప్ కుమార్ భార్య మాత్రం ఈ ఘటనకు పూర్తి భిన్నంగా అభిప్రాయపడుతూ, తన భర్త మరణానికి ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ కుమార్ దౌర్జన్యమే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా అమ్నీత్ పై కేసు నమోదైంది. ఆమెను అరెస్టు చేసేంతవరకు భర్త అంత్యక్రియలు జరపమని కుటుంబ సభ్యులతో కలిసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి ఆందోళన చేపట్టారు.
ఈ రెండు ఆత్మహత్యల చుట్టూ అవినీతి, అధికార దుర్వినియోగం, వ్యక్తిగత ప్రతిష్టల యుద్ధం, కులవివక్ష, మరియు కుటుంబ సంతాపాలు ఒకదానికొకటి మిళితమై సంక్లిష్టమైన పరిస్థితిని తలెత్తించాయి. ఒకరు అవినీతి ఆరోపణలతో చనిపోవడం, మరొకరు ఆ అవినీతిపై స్పందించి మృతిచెందడం — ఆ తర్వాత ఒకరినొకరు బాధ్యులుగా చూపే ఆరోపణలు — ఇవన్నీ హర్యానాలో ఉన్న పోలీస్ వ్యవస్థ లోపాలను బయటపెట్టాయి.
ప్రస్తుతం అమ్నీత్ పై కేసు నమోదు కాగా, విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హర్యానా ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు మరణాలు నిజంగా ఆత్మహత్యలేనా? లేక మరేదైనా కుట్రల ఫలితమా? అనేది సమగ్ర విచారణ అనంతరం మాత్రమే స్పష్టతకి వస్తుంది.