తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మసబ్ ట్యాంక్‌లోని ఈసీ కార్యాలయంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ ఈ వినతిని అందజేశారు.
మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించే వరకు ఎన్నికలు జరిపితే అన్యాయం అవుతుందని వారు తెలిపారు. అలాగే, ఇంటర్, పదవ తరగతి పరీక్షల సమయానికి ఎన్నికలు నిర్వహిస్తే, విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి కారణంగా విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారన్నారు.
ఈ కారణాల దృష్ట్యా, పరీక్షలు పూర్తయ్యాక మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా, ఎన్నికలను ముందుకు తెచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సర్పంచులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ గ్రామీణ పాలనను సంక్షోభంలోకి నెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
42% బీసీ రిజర్వేషన్లు అమలైన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. గ్రామీణ అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేసి, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సర్పంచుల సంఘం స్పష్టం చేసింది.
