మహారాష్ట్రలోని సమృద్ధి హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం పెద్ద విషాదం తప్పించుకుంది. ముంబై నుండి జాల్నాకు బయలుదేరిన ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల 12 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.
పోలీసుల వివరాల ప్రకారం, బస్సులో డ్రైవర్, అసిస్టెంట్‌తో పాటు మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నాగ్‌పూర్ లేన్‌పై ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఇంజిన్ వద్ద నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ వెంటనే అప్రమత్తమయ్యాడు. బస్సును రోడ్డుపక్కకు నిలిపి, ప్రయాణికులందరినీ త్వరగా కిందకు దింపాడు. క్షణాల్లో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో అది పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, హైవే పోలీసులు, టోల్ ప్లాజా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం వల్ల నాగ్‌పూర్ లేన్‌పై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో హైవేలపై బస్సుల్లో మంటలు చెలరేగడం తరచుగా జరుగుతుండడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత వారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవదహనమై ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం రేపింది. అలాగే గత ఆదివారం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సులో కూడా మంటలు చెలరేగగా, డ్రైవర్ మరియు కండక్టర్ సమయస్ఫూర్తితో 70 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
తాజా ఘటనతో మళ్లీ లగ్జరీ బస్సుల్లో భద్రతా ప్రమాణాలపై, వాహనాల సాంకేతిక పరిశీలనలపై చర్చ మొదలైంది. అధికారులు అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పర్యవేక్షించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
