ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో సుమారు 200 సంవత్సరాలుగా ఒక విభిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. దేశమంతా దీపావళి వెలుగులతో కళకళలాడుతుంటే, ఈ ఊరు మాత్రం దీపావళి పండుగకు దూరంగా ఉంటోంది. పండుగ రోజున గ్రామం నిశ్శబ్దంగా, చీకటిగా మగ్గిపోతుంది.
ఈ అనన్య సంప్రదాయం వెనుక ఓ విషాదకర ఘటన ఉంది. 200 సంవత్సరాల క్రితం, దీపావళి రోజు పున్నానపాలెం గ్రామంలో ఉహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని పాము కాటేసి ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజున, గ్రామానికి చెందిన రెండు ఎద్దులు కూడా మరణించాయి. ఈ వరుస విషాదాలతో గ్రామస్థులు తీవ్రంగా కలత చెందారు.
గ్రామ పెద్దలు ఈ ఘటనలతో దిగ్భ్రాంతి చెందుతూ, దీపావళి పండుగను జరుపుకోవడం భవిష్యత్తులో అపశకునం కాదని భావించి ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం, ఆ రోజున ఎవరూ పండుగ వేడుకలు జరుపరాదు, దీపాలు వెలిగించరాదు, టపాసులు కాల్చరాదు. ఇందుకే, పన్నానపాలెం గ్రామం 200 ఏళ్లుగా దీపావళి సంబరాలకు దూరంగా ఉంది.
తరాలు మారినా, గ్రామస్థులు తమ పూర్వీకుల ఆచారాన్ని గౌరవిస్తూ దీపావళి పండుగను జరుపుకోవడం మానేశారు. ప్రతి సంవత్సరం ఆ రోజున ఊరు ప్రశాంతంగా, నిశ్శబ్ద వాతావరణంలో ఉంటుంది. ఈ సంప్రదాయం, పూర్వీకుల నిర్ణయాలను కొత్త తరం కూడా కొనసాగిస్తూ, వింత, ప్రత్యేకమైన ఆచారంగా నిలిచింది.