‘శివ’ రీ రిలీజ్ – నాగ్ కెరీర్‌కు మలుపు, వర్మకు నిలువెత్తు విజయగాధ!


తెలుగు సినిమా చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన చిత్రం ‘శివ’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా 1989లో విడుదలైన ఈ చిత్రం, అప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కొత్త యుగాన్ని ఆరంభించింది. రియలిస్టిక్ యాక్షన్, యూత్‌లో ఉత్సాహం నింపిన కంటెంట్, సెన్సేషనల్ మ్యూజిక్‌తో ‘శివ’ ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 14న ‘శివ’ రీ రిలీజ్ అవుతోంది.

ఇటీవల సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాతో సంబంధించిన అరుదైన అనుభవాలను పంచుకున్నారు. “చాలామంది జీవితంలో విజయం సాధించిన తర్వాత, మొదట్లో ఎదుర్కొన్న అవమానాలను గురించి మాట్లాడుతుంటారు. కానీ నాకు అది సరైన పద్ధతి కాదు. అప్పట్లో మనకు గుర్తింపు లేకపోతే, మనపై ఎందుకు గౌరవం చూపాలి? ఆ స్థాయికి చేరుకోకపోవడం మన తప్పే అని నమ్ముతాను. ‘శివ’ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నా, దాటుకొని ముందుకు వెళ్లాను” అని అన్నారు వర్మ.

ఆయన మరో ఆసక్తికర విషయాన్ని కూడా చెప్పారు. “నాగార్జున గారు ‘శివ’ చేయడానికి ఓకే అన్నా, నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చని భావించాను. అందుకే ఆయనను, అలాగే వెంకట్ గారిని ఒప్పించాల్సిన అవసరం వచ్చింది. వారిని నమ్మకం కలిగించేలా దగ్గరవుతూ ప్రాజెక్ట్‌ను ముందుకు నడిపాను. అప్పట్లో కొన్ని ప్రాజెక్టులు ‘శివ’కు అడ్డుపడకుండా ఉండేందుకు నేను కొన్ని అబద్ధాలు చెప్పవలసి వచ్చింది, కొన్ని కుట్రలు చేయవలసి వచ్చింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించాయి, ‘శివ’ సినిమాతో చరిత్ర సృష్టించగలిగాం” అని వర్మ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

‘శివ’ చిత్రం నాగార్జున కెరీర్‌లో మలుపు తిప్పడమే కాకుండా, వర్మకు దర్శకుడిగా కొత్త దారులు తెరిచింది. ఈ సినిమాతో తెలుగు సినిమా సాంకేతికత, కథనం, బిజువల్ ప్రెజెంటేషన్‌ పూర్తిగా మారిపోయాయి. నేటికీ ఆ సినిమా ప్రతి ఫ్రేమ్ యూత్ మైండ్‌లో నిలిచేలా ఉంది. నవంబర్ 14న రీ రిలీజ్ సందర్భంగా అభిమానులు మళ్లీ ఆ క్లాసిక్ మ్యాజిక్‌ను థియేటర్లలో అనుభవించడానికి సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *