హనుమకొండ జిల్లా నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మిట్టపల్లి శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. చదువు ఒత్తిడిని తట్టుకోలేక, తల్లిదండ్రుల అభిప్రాయాలను చెప్పలేక నలిగిపోయిన శివాని, చివరికి చావే దిక్కుగా భావించి ప్రాణాలు వదిలింది.
ఆమె మరణానికి ముందు రాసిన లేఖ… ప్రతీ అక్షరం మానసికంగా కుంగిపోయిన పిల్లల మనస్థితిని అద్దం పడుతోంది. “మమ్మీ! ఆ చదువు నాకు అర్థం కావడం లేదు.. మైండ్ పోతాంది.. నాతో కాదు..” అంటూ ప్రారంభమైన ఆ లేఖ ఆత్మవేదనతో నిండిపోయింది. తాను చదువుతున్న కోర్సు తనకు సరిపోవడం లేదని, టెన్షన్ తట్టుకోలేకపోతున్నానని వివరించింది.
తనపై తల్లిదండ్రులు వేసిన అంచనాలు, చదువును కొనసాగించలేకపోతున్న స్థితి, ఆ అర్థమవకుండాచేసే ఒత్తిడి.. ఇవన్నీ ఆమెను మానసికంగా మరింతగా ఒత్తిడికి గురిచేశాయి. తల్లిదండ్రులకు చెప్పలేని బాధను అంతరంగం నుంచి ఒలికించిందీ లేఖ. “ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టిండ్రని అడిగినా.. నా వల్ల కాదు.. తక్కువ మార్కులు వస్తే మీరు తట్టుకోలేరు కాబట్టి చనిపోతున్నా” అనే మాటలు ప్రతి తల్లిదండ్రి హృదయాన్ని కలచివేయకమానవు.
లేఖలో చివర్లో తన చెల్లెలు కోసం తన ప్రేమను వ్యక్తపరిచింది. “చెల్లి నువ్వు బాగా చదువు.. మంచి గ్రూప్ తీసుకో. అందరూ జాగ్రత్త” అంటూ చెప్పిన శివాని, తనకు ఎదురైన బాధలు చెల్లెలు భరించకూడదని కోరింది.
ఈ సంఘటన మన సమాజానికి బలమైన హెచ్చరిక. యువత చదువు ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఎలా తక్కువ వయసులోనే జీవితాన్ని వదులుకుంటున్నారో స్పష్టంగా చూపిస్తోంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారి మనోవేదనల పట్ల తల్లిదండ్రులు, గురువులు, సంస్థలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
శివాని లేఖ ఒక విద్యార్థినిలా కాక, ప్రతి పిల్లవాడి అంతరంగపు పోరాటాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ ఘటన ద్వారా తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెట్టడం తగ్గించాలి. విద్యను ఆసక్తిగా నేర్చుకునేలా, మానసికంగా ఆరోగ్యంగా పెరిగేలా వారిని ప్రోత్సహించాలి.
