శబరిమల ఆలయంలో సంచలనమైన బంగారం చోరీ కేసు బయటపడింది. గర్భగుడి, ద్వార పాలక విగ్రహాల కోసం స్వర్ణ తాపడం పనులను నిర్వహించే సమయంలో 4.5 కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపెట్టింది. ఈ ఘటనపై కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది.
బంగారు తాపడం బాధ్యత ఉన్న ఉన్నికృష్ణన్ అనే దాతను అధికారులు విచారించారు. అతకు స్థిరమైన ఆదాయం లేకపోవడం, ఇతర దాతలు ఇచ్చిన విరాళాలను తానే ఇచ్చినట్లు ప్రచారం చేయడం వంటి విషయాలు తేల్చబడింది. బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ గతేడాది ఐటీ శాఖకు సమర్పించిన ఆదాయ వివరాలు పరిశీలించిన తర్వాత ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి.
శబరిమల ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవోసం బోర్డు (TDDB) విజిలెన్స్ విభాగం నివేదికలో కూడా ఇదే వివరాలు వెల్లడించబడ్డాయి. సాధారణ సేవా విరాళాలుగా ఉన్న రూ.10.85 లక్షల నిధులు, బళ్లారి వ్యాపారి గోవర్దన్ ఇచ్చిన నిధులు ఉన్నికృష్ణన్ బ్యాంక్ ఖాతాలో చేరినట్లు గుర్తించారు. అలాగే, అన్నదాన మండప నిర్మాణానికి రూ.10 లక్షలు, అన్నదానం కోసం రూ.6 లక్షలు ఉన్నికృష్ణన్ అందించారు.
2017లో కూడా అతను అన్నదాన కోసం రూ.8.20 లక్షల నగదు, 17 టన్నుల బియ్యం, 30 టన్నుల కూరగాయలు అందించినట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. ఈ విరాళాలను పరిశీలించిన తర్వాత గర్భగుడి స్వర్ణ తాపడం పనులు ఉన్నికృష్ణన్‌కు అప్పగించబడ్డాయి. అయితే పనులు పూర్తయిన తర్వాత 4.5 కిలోల బంగారం మాయం కావడం గందరగోళానికి కారణమైంది.
సిట్ విచారణలో ఉన్నికృష్ణన్ను ఏ1 నిందితుడిగా పేర్కొని, TDDBలో ఉన్న ఇతర అధికారులను కూడా నిందితులుగా చేర్చింది. 2019లో స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారం స్వర్ణ తాపడం కోసం ఉపయోగించబడింది. కానీ ఈ తాపడం ప్రక్రియలో లెక్కల్లో తేడా రావడం, బంగారం మాయం కావడం వివాదానికి దారి తీసింది.