ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభాన్ని రెండు నెలలు ముందుకు తెచ్చిన ప్రభుత్వం, ఏప్రిల్ 1 నుంచే తరగతులు మొదలు పెట్టింది. కానీ ఈ నిర్ణయానికి తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు ప్రమోట్ అయిన విద్యార్థులు సైతం కాలేజీలకు రావడం లేదు. వేసవి కాలం కావడం, పబ్లిక్ పరీక్షలు ముగిసిన వెంటనే తరగతులు పెట్టడం వంటి అంశాలపై వారిలో ఆసక్తి లేకపోవడం స్పష్టమవుతోంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. కొన్ని కాలేజీల్లో 30 శాతం కూడా హాజరు కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు వేసవిలో వ్యవసాయ పనుల్లో పాల్గొనడం, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల తరగతులకు రావడం ఇబ్బందిగా మారింది. ఫస్టియర్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫలితాలే రాకుండా కాలేజీ ప్రారంభించడాన్ని తప్పుబడుతున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్న లెక్చరర్లు వింత అనుభవాలు ఎదుర్కొంటున్నారు.
తరగతుల ప్రారంభ దినమే పాఠ్యపుస్తకాలు, నోట్లు పంపిణీ చేసినా విద్యార్థులు హాజరు కావడం లేదు. బ్రిడ్జి కోర్సుల ద్వారా ఇంగ్లిష్, గణితం, సైన్స్ ప్రాథమిక అంశాలు బోధిస్తున్నా ఆసక్తి కనిపించడం లేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఈ నెల 23 వరకు తరగతులు జరిపి, మే నెలాఖరులో వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అయినా విద్యార్థుల హాజరుపై స్పష్టమైన మార్పు లేదు.
ఇంకా విద్యార్థులకు ఎలాంటి గ్రూపు ఎంచుకోవాలన్న విషయమై స్పష్టత లేదు. ఎక్కువగా సీఈసీ, హెచ్‌ఈసీ వంటి సైన్సేతర గ్రూపులను తీసుకుంటున్న విద్యార్థులకు ప్రస్తుతం బ్రిడ్జి కోర్సులో గణితం, సైన్స్ బోధన నిర్వహించడం కూడా అసందర్భంగా కనిపిస్తోంది. వీటన్నింటి వల్ల వేసవిలో తరగతులు పెట్టిన ప్రయోజనం కోల్పోతుందా? అనే చర్చ మొదలైంది. విద్యార్థుల హాజరును పెంచేందుకు మరింత కార్యాచరణ అవసరమని భావిస్తున్నారు.
