మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె డాక్టర్ ఎన్. సునీతారెడ్డి, మరింత లోతుగా దర్యాప్తు జరపాలని కోరుతూ బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం, ట్రయల్ కోర్ట్‌ను ఆశ్రయించి కేసును మరింత సమగ్రంగా విచారించాలని ఆమె అభ్యర్థించింది.
సునీత తన పిటిషన్‌లో, ఈ కేసులో దర్యాప్తును కొద్దికాలిక మాత్రమే పరిమితం చేస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని, ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న తనకు అన్యాయం జరగకూడదని వెల్లడించారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ మరియు ఏపీ పోలీసులు సుప్రీంకోర్టుకు సమాచారం అందించారని పేర్కొన్నారు.
అయితే, ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, కడప జైలులో ఉన్న నాలుగో నిందితుడు దస్తగిరిని ప్రలోభపెట్టడం, బెదిరించడం ద్వారా కేసులో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు సునీత ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోర్టుకు విన్నవించారు.
అంతేకాక, వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి, మొదట ఫిర్యాదు చేసిన తర్వాత తనపై, తన భర్త రాజశేఖర్ రెడ్డిపై, అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టారని సునీత పేర్కొన్నారు. అయితే, ఏపీ పోలీసులు విచారణ జరిపి, ఆ కేసులు అసత్యమని తుది నివేదిక సేకరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, సునీత కోర్టును అభ్యర్థిస్తూ, కేసును లోతుగా దర్యాప్తు చేసి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐని ఆదేశించాలని కోరారు.