బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎప్పుడూ తన కృషి, అంకితభావంతో అభిమానుల ప్రశంసలు అందుకుంటుంటారు. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. సినిమా రిలీజ్ అయ్యి నెలలు గడిచినా, ఇంకా ఓటీటీలో రిలీజ్ కాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
తన పాత్రకు సంబంధించిన ఓ స్టిల్‌ని షేర్ చేసిన హృతిక్, “కబీర్ పాత్రలో నటించడం నాకు చాలా ఎంజాయ్‌మెంట్ ఇచ్చింది. ఇది ఒక కఠినమైన ప్రాజెక్ట్ అయినా, పూర్తిగా అర్థం చేసుకుని సవాల్‌గా తీసుకుని పూర్తి చేశాను” అని రాశారు. తన వర్క్ ఫిలాసఫీ గురించి చెబుతూ, “ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అయినా, దాన్ని లైట్‌గా తీసుకోవాలి. ఒక నటుడిగా మన బాధ్యతను 100 శాతం నిర్వర్తించి ఇంటికి వెళ్ళిపోవాలి. ‘వార్ 2’లో కూడా నేను ఇదే దృక్పథంతో పని చేశాను” అని తెలిపారు.
అంతేకాకుండా దర్శకుడు అయాన్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించిన హృతిక్, “అయాన్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సన్నివేశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యుత్తమ అవుట్‌పుట్ కోసం శ్రమించారు. ఆయనతో పని చేయడం నాకు చాలా సంతోషం ఇచ్చింది” అని అన్నారు. సినిమా చేస్తున్న సమయంలో తన మనసులో మెలిగిన ఆలోచనను కూడా పంచుకున్నారు. “ప్రతి సినిమాను విజయవంతం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాం. కానీ ప్రతి ప్రాజెక్ట్ కోసం గాయపడటం లేదా శారీరకంగా తలకిందులు కావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా, క్రమంగా పని చేస్తే విజయం దానంతట అదే వస్తుంది” అని హృతిక్ పేర్కొన్నారు.
సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ సాధించకపోయినా, ఫలితాన్ని పాజిటివ్‌గా స్వీకరిస్తూ, తన దృక్పథాన్ని అభిమానులతో పంచుకున్న హృతిక్ రోషన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చూపించిన ఈ సానుకూల ఆలోచన నిజంగా ప్రేరణాత్మకమని కామెంట్లు పెడుతున్నారు