వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటన. మృతుల సంఖ్య 402

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 402కి పెరిగింది. గాలింపు చర్యల్లో ఇంకా మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. గల్లంతైన మరో 170 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న చురల్ మల, వెలరి మల, ముందకయిల్, పుంచిరిమదోం ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత కొన్ని రోజులుగా చలియార్ నదిలో మృతదేహాలు, శరీర అవయవాలు కొట్టుకుని వస్తుండడంతో, ప్రత్యేక బృందాల సాయంతో అక్కడ కూడా గాలిస్తున్నారు. శరీర అవయవాలు ఎవరివన్నది గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు.

వయనాడ్ జిల్లాలో సహాయకచర్యలు నేడు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. సహాయకచర్యలు, గాలింపు కార్యక్రమాల్లో త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పోలీసు శాఖ, అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది, వాలంటీర్లతో కలిపి 1200 మందికి పైగా పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *