గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. అక్రమ అరెస్టులతో రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో న్యాయం, చట్టానికి విలువ లేకుండా పోయిందని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. వంశీ భద్రతకు ఎలాంటి హాని జరిగినా, దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గన్నవరం కేసులో టీడీపీ కుట్రను ఓ దళిత యువకుడు బట్టబయలు చేశారని జగన్ తెలిపారు. న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంతో టీడీపీ కుట్ర బయటపడిన తర్వాత, చంద్రబాబు తట్టుకోలేక మరో కుట్రకు తెరతీశారని ఆరోపించారు. వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ యువకుడి కుటుంబంపై పోలీసులు, టీడీపీ కార్యకర్తలు బెదిరింపులకు దిగినట్లు వెల్లడించారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయాలని టీడీపీ చూస్తోందని విమర్శించారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసు పెట్టడం దుర్మార్గమని జగన్ అన్నారు. అబ్బయ్య డ్రైవర్‌ను టీడీపీ ఎమ్మెల్యే తిట్టిన వీడియోను ప్రజలు చూశారని, నిజమైన నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, అరెస్టులతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేక, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే కుట్రలు పన్నుతోందని జగన్ ఆరోపించారు. ప్రజలు వీటిని గమనిస్తున్నారని, తగిన మూల్యం చంద్రబాబుకు చెల్లించాల్సి వచ్చే రోజు దరిచేరిందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలను వైసీపీ తట్టుకోదని స్పష్టం చేశారు.