రైల్లో మహిళపై దారుణం — కత్తితో బెదిరించి అత్యాచారం


రైలు ప్రయాణంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దారుణం జరిగింది. ఏపీలోని రాజమహేంద్రవరం – సంత్రగచి స్పెషల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు, పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.

బాధితురాలి వివరాల ప్రకారం — ఆమె చర్లపల్లి వెళ్తుండగా రాజమహేంద్రవరంలో ట్రైన్ ఎక్కింది. రైలు గుంటూరు దాటిన తర్వాత బోగీలో తాను తప్ప ఎవరూ లేరని గుర్తించిందని తెలిపింది. ఆ సమయంలో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బోగీలోకి వచ్చి, కత్తితో బెదిరించి తనపై అఘాయిత్యం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

దుండగుడు ఆపై బాధితురాలి హ్యాండ్‌బ్యాగ్‌, నగలు, సెల్‌ఫోన్‌ లాక్కుని, రైలు పెద్దకూరపాడు స్టేషన్‌లో ఆగగానే దిగిపోయాడు. చర్లపల్లికి చేరుకున్న తర్వాత మహిళ వెంటనే జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌లు సేకరించడమే కాకుండా నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో రైల్వే ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. మహిళా ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *