పండుగ సీజన్‌లో తరచుగా ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఇకపై మీరు మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు! ఈ ప్రత్యేక సౌకర్యాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) తమ అధికారిక ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్‌లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రహదారుల ప్రయాణం మరింత సులభం, చౌకగా మారనుంది.
ఈ పాస్‌తో వాహనదారులు ఏటా రూ.3,000 చెల్లించి ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా ప్రయాణాల వరకు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు. ఇది పండగ సీజన్‌లో ఎక్కువగా ప్రయాణించే వ్యక్తులకు సరిగ్గా సరిపడే ఆఫర్ అని అధికారులు పేర్కొన్నారు.
పాస్ గిఫ్ట్ చేసే విధానం:
ముందుగా ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్ ఓపెన్ చేయాలి.
“Add Pass” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
పాస్ ఇవ్వాలనుకునే వ్యక్తి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మరియు మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసిన వెంటనే, ఆ వాహనానికి లింక్ అయిన ఫాస్టాగ్‌పై యాన్యువల్ పాస్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
ఈ ప్రక్రియ పూర్తయిన రెండు గంటల్లో పాస్ పనిచేయడం ప్రారంభమవుతుంది.
పాస్ ధర మరియు వ్యాలిడిటీ:
- ధర: రూ. 3,000 మాత్రమే
- వ్యాలిడిటీ: ఒక సంవత్సరం లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు
- పరిమితి ముగిసిన తర్వాత ఫాస్టాగ్ సాధారణ పే-పర్-ట్రిప్ మోడ్‌లోకి మారుతుంది.
- ఇది కేవలం నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 1,150 టోల్ ప్లాజాలు ఈ పాస్ కింద చెల్లుబాటు అవుతాయి. చెల్లింపులు UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. అయితే, ఫాస్టాగ్ వాలెట్ బ్యాలెన్స్‌ను ఈ పాస్ కొనుగోలుకు ఉపయోగించరాదు.
గమనించాల్సిన అంశం:
వాహనం ఫాస్టాగ్‌లో పూర్తి రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి. కేవలం చాసిస్ నంబర్‌తో రిజిస్టర్ అయిన ఫాస్టాగ్‌లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు.
రికార్డు స్థాయి స్పందన:
ఈ సర్వీస్ ప్రారంభమైన రెండు నెలల్లోనే 25 లక్షల మందికి పైగా వినియోగదారులు యాన్యువల్ పాస్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారని ఎన్‌హెచ్ఏఐ వెల్లడించింది. ఇప్పటివరకు 5.67 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనంగా అధికారులు పేర్కొన్నారు.