పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న తన కొత్త చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్లలో పాల్గొంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుండగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రమోషన్లలో భాగంగా రష్మిక మాట్లాడుతూ – “నటీనటులకూ ఆఫీస్ ఉద్యోగుల మాదిరిగానే 9 నుంచి 5 వరకు పనివేళలు ఉండాలి. ఓవర్‌వర్క్ చేయడం గొప్ప విషయం కాదు. శరీరం, మనసు రెండింటికీ విశ్రాంతి చాలా అవసరం. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం” అని పేర్కొన్నారు.
అలాగే భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడుతూ, “ఇప్పుడే కష్టపడతాను. కానీ భవిష్యత్తులో నా కుటుంబం, పిల్లల కోసం మంచి జీవితం గడపాలనుకుంటున్నాను. నాకు పిల్లలు పుడతారు, వారి కోసం ఇప్పటి నుంచే నేను మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. మన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి, లేకపోతే జీవితంలో ప్రశాంతత ఉండదు” అని ఆమె చెప్పింది.
“20 నుంచి 30 ఏళ్ల మధ్య కష్టపడాలి. 30 నుంచి 40 మధ్యలో బ్యాలెన్స్ చేయాలి. 40 తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే జీవితం పట్ల స్పష్టమైన దృష్టి ఉండాలి” అని రష్మిక చెప్పిన మాటలు చాలా మందికి ప్రేరణగా మారాయి.
ప్రస్తుతం రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో ఆమె మాటలను షేర్ చేస్తూ “స్మార్ట్ థింకింగ్”, “రియల్ స్టార్ రష్మిక”, “సెలబ్రిటీ హ్యూమన్ సైడ్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 
				
			 
				
			 
				
			 
				
			