రమ్యపై ట్రోలింగ్ కేసులో 12 మంది దర్శన్ అభిమానులపై ఛార్జ్‌షీట్!


కన్నడ సినీ నటి, మాజీ ఎంపీ రమ్యపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో కర్ణాటక పోలీసులు కీలక ముందడుగు వేశారు. నటుడు దర్శన్ అభిమానులుగా గుర్తించిన 12 మందిపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) గురువారం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. బెంగళూరు 45వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టుకు 380 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను సమర్పించారు.

ఈ ఘటనకు మూలం దర్శన్ అభిమాని హత్య కేసు. ఆ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని రమ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, దర్శన్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్, దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించారు. కొందరు మరీ అత్యాచారం చేస్తామంటూ రమ్యను బెదిరించారు. ఈ నేపథ్యంలో రమ్య జూలై 28న బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్కు ఫిర్యాదు చేశారు.

రమ్య తన ఫిర్యాదులో 43 సోషల్ మీడియా ఖాతాల వివరాలను అందజేశారు. విచారణలో పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసి, వారందరూ దర్శన్ అభిమానులేనని నిర్ధారించారు. ఛార్జ్‌షీట్‌లో రమ్య వాంగ్మూలంతో పాటు నిందితుల అంగీకార వాక్యాలు, సోషల్ మీడియాలో చేసిన అసభ్య పోస్టుల స్క్రీన్‌షాట్‌లు జతపరిచారు. అరెస్టయిన వారిలో నలుగురు జైల్లో ఉండగా, మిగతావారు బెయిల్‌పై విడుదలయ్యారు.

ఈ ఘటనపై రమ్య మాట్లాడుతూ, “నేను సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ న్యాయంపై విశ్వాసం కలిగించేందుకే. అయితే ఆ తర్వాత నాపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. ఒక మహిళ గొంతుకగా ఈ ఫిర్యాదు చేశాను. నాకే ఇలా జరిగితే, సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించారు. ఆమె ఇంకా పేర్కొంటూ, “దర్శన్ తన అభిమానులను నియంత్రించి, ఇలాంటి చర్యలు చేయవద్దని చెప్పాలి. సెలబ్రిటీలు చట్టాన్ని గౌరవిస్తూ, సమాజానికి ఆదర్శంగా ఉండాలి,” అన్నారు.

పోలీసులు ప్రస్తుతం మరో ఆరుగురు నిందితులను వెతుకుతున్నారు. వారిని అరెస్ట్ చేసిన తర్వాత అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేసు విచారణను కోర్టు త్వరలో ప్రారంభించనుంది. ఇక దర్శన్ అభిమాని హత్య కేసులో, నటుడు దర్శన్ రెండో నిందితుడిగా, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ మొదటి నిందితురాలిగా ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *