‘టిల్లు’ హీరో సిద్దు జొన్నలగడ్డ తన అభిమానులతో “ఆస్క్ సిద్దు” పేరుతో సోషల్ మీడియా చిట్‌చాట్ నిర్వహించగా, అందులో చెప్పిన ఓ సమాధానం ఇప్పుడు వివాదంగా మారింది. తన కొత్త సినిమా ‘తెలుసు కదా’ విడుదలకు ఒక్క రోజు ముందు, ట్విట్టర్ (X) వేదికగా అభిమానులతో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ సిద్దు ఈ సెషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన “మీ ఫేవరెట్ హీరో ఎవరు?” అనే ప్రశ్నకు సిద్దు “రణ్‌బీర్ కపూర్” అని సమాధానం ఇవ్వడంతో నెటిజన్లు విస్తుపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన తారాగణం ఉండగానే బాలీవుడ్ హీరోని అభిమానిగా పేర్కొనడమేంటని పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
“తెలుగు ఇండస్ట్రీ హీరోలే నిన్ను సపోర్ట్ చేస్తున్నారు… బాలీవుడ్ హీరోని ఎందుకు మెచ్చుకుంటావ్?” అంటూ ట్రోలింగ్ ప్రారంభమైంది. అయితే, మరోవైపు కొంతమంది అభిమానులు సిద్దు అభిప్రాయానికి గౌరవం ఇస్తూ, ఇది వ్యక్తిగత అభిరుచి అని అతనికి మద్దతు పలికారు.
ఈ ట్రోలింగ్ వ్యవహారంతో పాటు, సిద్దు ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా ప్రెషర్‌తో ఉన్న పరిస్థితి. గతంలో కొన్ని ఫ్లాపులు ఎదురైన సిద్దు, ఈసారి ‘తెలుసు కదా’ సినిమాతో మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్నారు.
ఈ సినిమాలో సిద్దు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నీరజ్ కోన దర్శకత్వంలో, టీజీ విశ్వప్రసాద్ మరియు టీజీ కృతిప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ రొమాంటిక్ యూత్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 17న విడుదల కానుంది.