బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఉధృతంగా మారుతోంది. ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం సముద్రం తీవ్ర ఆందోళనలో ఉంది. భారీ అలలు తీరప్రాంతాలను ఢీకొడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. తుపాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని అన్ని ప్రధాన పోర్టులను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ చేసింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం మరియు గంగవరం పోర్టులకు ఆరో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అధికారులు తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సమాచారం.
