హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న కానిస్టేబుళ్లపైకి ఓ లారీ దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
లారీ కూకట్‌పల్లిలో బియ్యం బస్తాలు దిగబెట్టి మియాపూర్ వైపు వస్తుండగా… పిల్లర్ నంబర్ 600 వద్ద ట్రాఫిక్ బూత్‌ను ఢీకొట్టింది. అప్పట్లో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సింహాచలం, రాజవర్ధన్, విజేందర్ లారీ ఢీకొట్టడంతో నేలకూలిపోయారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో హోంగార్డు సింహాచలం అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇద్దరు గాయపడిన పోలీసుల్లో రాజవర్ధన్ భుజానికి ఫ్రాక్చర్ కాగా, విజేందర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే మదీనాగూడలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. సింహాచలం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్టు పోలీసులు తెలిపారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందినవాడిగా గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అతను సదాశివపేటకు చెందిన శ్రీనివాస్ అని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతున్నట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.