ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె శరీర భాగాలు తాకిన 33 ఏళ్ల వ్యక్తిని కొందరు పట్టుకుని దుస్తులు విప్పించి చితకబాదారు. బెంగళూరు శివారులోని కాల్కరే గ్రామంలో జరిగిందీ ఘటన. ధర్వాడ్కు చెందిన బాధితుడు రవికుమార్ రెండేళ్లుగా కాల్కరే సమీపంలోని ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్నాడు.
రాత్రి పది గంటల సమయంలో ఓ యువతి (20) పాలు కొనేందుకు రోడ్డుపైకి వచ్చింది. ఆమెను చూసిన రవికుమార్ అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరాన్ని అనుచితంగా తాకాడు. దీంతో ఆమె భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చి నిందితుడిని పట్టుకున్నారు. దాదాపు 12 మంది కలిసి అతడిపై దాడి చేస్తుండగా బాధిత మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
నిందితుడిని పట్టుకున్న గుంపు అతడి ధోతీని విప్పించి తొడలు, ఇతర శరీర భాగాలపై దారుణంగా దాడిచేశారు. అనంతరం ఓ ఆటోలో నిందితుడిని తీసుకెళ్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు వారి చెర నుంచి బాధితుడిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగతా వారిని కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు. బాధితురాలిని కలిసి వివరాలు సేకరించామని, అయితే, ఆమె ఫిర్యాదు చేసేందుకు నిరాకరించిందని తెలిపారు. ఆమె నిందితుడు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			